ఒకవైపు యుద్ధం.. అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ టీమ్.. న్యూజిలాండ్తో నేడే తొలి పోరు!
FIFA World Cup 2026: ఎన్నో అడ్డంకులను దాటుకుని, తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆదివారం నాడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. గ్రూప్-జీలో భాగంగా ఈరోజు (జూన్ 15, సోమవారం) న్యూజిలాండ్‌తో జరగబోయే తమ తొలి మ్యాచ్ కోసం ఇరాన్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇటీవలి సైనిక దాడులతో ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అమెరికా వీసాల సందిగ్ధత కారణంగా ఇరాన్ జట్టు ఇన్నాళ్లూ మెక్సికోలోని టిజువానా (Tijuana) బేస్ క్యాంప్‌లోనే ఉండి ప్రాక్టీస్ చేసింది. ఆదివారం రోజు అమెరికాకు బయలుదేరేటప్పుడు మెక్సికో అభిమానులు వారికి అద్భుతమైన వీడ్కోలు పలికారు. హోటల్ వెలుపల వేలాది మంది సెండాఫ్ ఇచ్చారు. రెడ్ షర్టుల్లో ఉన్న సపోర్ట్ స్టాఫ్ అభిమానులకు ఇరాన్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. నెవీ బ్లూ పోలో షర్టులు, బేజ్ కలర్ ట్రౌజర్లు ధరించిన ఇరాన్ ప్లేయర్స్ నవ్వుతూ అభిమానులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ఒక అభిమాని ఇరాన్.. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు, మెక్సికో నీకు తోడుగా ఉంటుందనే పసుపు రంగు బోర్డును ప్రదర్శించాడు.
నిజానికి ఇరాన్ జట్టు అమెరికాలోని అరిజోనాలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకోవాల్సింది. కానీ, ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిపిన సైనిక దాడుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ మ్యాచ్‌లను అమెరికా వెలుపలికి మార్చాలని ఇరాన్ కోరినప్పటికీ కుదరలేదు. దీంతో ఆటగాళ్లకు అమెరికా వీసాలు వస్తాయో లేదో అనే అభద్రత నెలకొంది. అందుకే వారు మెక్సికోకు క్యాంప్ మార్చారు. ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మెహదీ తాజ్ నిరంతరం శ్రమించి, టోర్నీ ప్రారంభానికి కేవలం 10 రోజుల ముందే ఆటగాళ్లకు వీసాలు సాధించారు. కానీ, కోచింగ్ అండ్ సపోర్ట్ స్టాఫ్‌లో కొంతమందికి ఇంకా వీసాలు రాకపోవడంతో వారు మెక్సికోలోనే ఉండిపోవాల్సి వచ్చింది.