చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవి ఈ పనులా.. పాకిస్థాన్ కెప్టెన్కి జై షా షేక్ హ్యాండ్పై గరం గరం!
Jay Shah Handshake: 2026 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే చేసిన ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంగ్లాండ్‌లో నిన్న (జూన్ 7న) జరిగిన కెప్టెన్స్ కార్నివాల్ ఈవెంట్‌లో ఐసీసీ ఛైర్మన్ జై షా, పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయగా, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ కావడంతో భారత్, పాకిస్థాన్ అభిమానుల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఐసీసీ ఛైర్మన్ జై షా చేసిన ఈ పనిని కొందరు క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా గతంలో ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో భారత్ అనుసరించిన నో హ్యాండ్‌షేక్ పాలసీని పాక్ ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. కానీ ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం జై షాను వెంటేసుకొస్తున్నారు. అతడు ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్నారు, ఆ పదవిలో ఉన్నప్పుడు అన్ని దేశాలను సమానంగా చూడాలి, సభ్య దేశాల ప్రతినిధులతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించడం జౌ షా కనీస బాధ్యత అని పేర్కొంటున్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అధికారిక కార్యక్రమాల్లో కూడా టీమిండియా ప్లేయర్స్ పాక్ ఆటగాళ్లకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జై షా తీరు ఆ పాత జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.