Ajith Kumar | అమ్మ మరణం.. బరువెక్కిన గుండెతో మళ్లీ రేసింగ్ సూట్ వేసిన అజిత్ కుమార్
Ajith Kumar Racing | తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (Mohini Mani) మరణించిన కొన్ని రోజులకే మళ్లీ రేసింగ్ ట్రాక్‌పైకి వచ్చారు. మే 30వ తేదీ ఉదయం చెన్నైలో మోహిని మణి (89) వృద్ధాప్య సమస్యలతో ప్రశాంతంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. అజిత్ ఈ తీవ్ర విషాదం నుంచి కోలుకోకముందే, జూన్ 5న ఆయన రేసింగ్ ప్రాక్టీస్ కోసం ట్రాక్‌పై అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అజిత్ కుమార్ రేసింగ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ‘బరువెక్కిన గుండెతో మళ్లీ పనిలోకి దిగాను, కానీ జీవితం సాగిపోవాలి’ అంటూ ఈ ఫోటోలకు ఒక ఎమోషనల్ క్యాప్షన్‌ను జత చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహిని మణి, నిద్రలోనే కన్నుమూశారని అజిత్ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకున్న వైద్యులకు, తమకు అండగా నిలిచిన వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మోహిని మణి మరణవార్త తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ముఖ్యమంత్రి విజయ్ భారీ భద్రత మధ్య అజిత్ ఇంటికి వచ్చి, ఆయనను కౌగిలించుకుని ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.