Select Location
All Locations
State
Region
City / District
Mamata Banerjee | అమిత్‌ షాపై వివాదాస్పద ఆరోపణలు.. మమతాబెనర్జీపై కేసు నమోదు..!

Mamata Banerjee | అమిత్‌ షాపై వివాదాస్పద ఆరోపణలు.. మమతాబెనర్జీపై కేసు నమోదు..!

Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పై సిలిగురి (Siliguri) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ (Cyber Crime PS) లో కేసు నమోదైంది. కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పై మమత వివాదాస్పద ఆరోపణలు చేశారని ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 2న కోల్‌కతాలో జరిగిన నిరసన సభలో మమతాబెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ జాతీయుడు ఉస్మాన్ హాది (Osman Hadi) హత్య గురించి ప్రస్తావించారు. హాది హత్య వెనుక కేంద్ర హోం శాఖ ప్రమేయం ఉందనే అర్థం వచ్చేలా ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై లాయర్ రింకీ సేన్ ఛటర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాది హత్య జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఆ హంతకులు మేఘాలయ సరిహద్దు దాటి బెంగాల్‌లోకి రాగా రాష్ట్ర ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అయితే ఈ హత్య కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకే జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఉండే హిందువుల భద్రతను కూడా ఇవి ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News