Select Location
All Locations
State
Region
City / District
బ్రహ్మాండ విజయం.. టెస్టుల్లో అతి పెద్ద విక్టరీతో భారత్‌ రికార్డు

బ్రహ్మాండ విజయం.. టెస్టుల్లో అతి పెద్ద విక్టరీతో భారత్‌ రికార్డు

సొంతగడ్డపై భారత్‌ తడాఖా చూపెట్టింది. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించి విజయదుందుభి మోగించింది. అరంగేట్రం స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ విజృంభణతో అఫ్గ్గాన్‌ను మూడు రోజుల్లోనే మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసిన గిల్‌సేన భారత టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే అతి పెద్ద విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

ముల్లాన్‌పూర్‌: చిన్న జట్టు అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మూడు రోజులు ముచ్చటే అయింది. ఖతర్నాక్‌ బ్యాటింగ్‌, అంతకుమించిన బౌలింగ్‌తో చెలరేగిన భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. అరంగేట్రం ఆటగాడు మానవ్‌ సుతార్‌ (6/33, 1/29)కు తోడు సుందర్‌ (4/36), కుల్దీప్‌యాదవ్‌ (3/30) చేసిన ముప్పేట స్పిన్‌ దాడికి అఫ్గ్గాన్‌ బిత్తరపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 113/5తో మూడో రోజు సోమవారం ఆట కొనసాగించిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. రెహమత్‌షా (60) కాస్త పోరాడాడు. అనంతరం 412 పరుగుల లోటుతో ఫాల్‌ఆన్‌కు దిగిన అఫ్గాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలో 112 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్‌ సెదికుల్లా అటల్‌ (42) టాప్‌స్కోరర్‌. రెండు ఇన్నింగ్‌లో కలిపి 7 వికెట్లు తీసిన సుతార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ముల్లాన్‌పూర్‌ పిచ్‌పై రెండో రోజు అఫ్గాన్‌ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన మానవ్‌ సుతార్‌ మూడో రోజూ తన జోరును కొనసాగించాడు. అప్పటికే పిచ్‌పై పూర్తి అవగాహనకు వచ్చిన సుతార్‌..వరుస విరామాల్లో వికెట్లు తీసి అఫ్గాన్‌ను దెబ్బతీశాడు. ఓవర్‌నైట్‌ జట్టు స్కోరుకు మూడు పరుగుల తేడాతో ఒమర్జాయ్‌(0)ను ప్రసిధ్‌ కృష్ణ క్లీన్‌బౌల్డ్‌ చేసి వికెట్ల పతనానికి నాందిపలికాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ బాధ్యతను తీసుకున్న రెహమత్‌ షా..అషఫ్‌(్ర11)తో కలిసి పోరాడాడు. అయితే సుతార్‌ బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించిన అషఫ్‌.్ర.కీపర్‌ పంత్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రెహమత్‌షాతో పాటు, సలీమ్‌(0)ను సుతార్‌ ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు.

కాసేపటికే రెహమాన్‌(6)ను సుందర్‌ ఆఖరి వికెట్‌గా ఔట్‌ చేయడంతో అఫ్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. భారీ ఆతిథ్యం ఉండటంతో ఆతిథ్య కెప్టెన్‌ గిల్‌..అఫ్గాన్‌ను ఫాలోఆన్‌కు దింపాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మాలిక్‌(8)ను సిరాజ్‌ తొలి వికెట్‌గా ఔట్‌ చేయగా, మిగతా పనిని స్పిన్నర్లు పూర్తిచేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన సుందర్‌, కుల్దీప్‌..ఈసారి రాణించారు. ఓ ఎండ్‌లో సుందర్‌, మరో ఎండ్‌లో కుల్దీప్‌ తమ స్పిన్‌ వైవిధ్యంతో వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో టీ విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. రెండు ఎండ్‌ల నుంచి స్పిన్నర్ల దాడిని అఫ్గాన్‌ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో సుతార్‌కు ఒక వికెట్‌ దక్కగా, అషఫ్‌. అబ్సెంట్‌హర్ట్‌గా బ్యాటింగ్‌కు రాలేదు.

Source : Smacy News

1 hour ago

Home Flash News