ఏపీలో 1523 ప్రభుత్వ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ వర్సిటీలలో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం ఖాళీలలో 279 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండగా, మిగిలిన 1,244 పోస్టులను రెగ్యులర్ ఖాళీల కింద భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 18 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభమైంది.
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అత్యధికంగా రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (RGUKT)లో 311 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ (AU)లో 246 పోస్టులు, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో 125 పోస్టులు మరియు అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)లో 103 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.