Select Location
All Locations
State
Region
City / District
రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల

రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఇకపై రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు 'స్టీమ్ రైస్' (ఉడికించిన బియ్యం) అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా, ఈ ఏడాది పైలట్‌ ప్రాజెక్టు కింద పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ స్టీమ్‌ రైస్‌ను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శాఖాపరమైన ప్రగతి, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.

జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 1,000 మినీమార్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మార్టులలో కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా, నిత్యావసర సరుకులు మరియు నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై కేవలం పార్టీల రంగులు, నాయకుల ఫొటోలు వేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని, కానీ తమ కూటమి ప్రభుత్వం మాత్రం సామాన్యుడి సంక్షేమం, రైతు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. డిజిటల్ విప్లవంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 'సీబీడీసీ' (డిజిటల్ రూపాయి) వాలెట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెడుతున్నామని, దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన సరకులను సులభంగా కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News