Select Location
All Locations
State
Region
City / District
'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనలపై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ!

'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనలపై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ!

దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. అయితే, ఈ నిరసనల కారణంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా, జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన సెలవుకాల ధర్మాసనం అందుకు నిరాకరించింది

సోషల్ మీడియా వేదికగా యువతలో ఎంతో ఆదరణ పొందిన ఈ డిజిటల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. జూన్ 6న ఢిల్లీ విమానాశ్రయంతో పాటు జంతర్ మంతర్ నిరసనల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మద్దతుదారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI), మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల ప్రవేశ మార్గాల వద్ద తక్షణమే రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలని, విమానాశ్రయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడాలని పిటిషనర్ కోరారు. అంతేకాకుండా ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఈ నిరసనలను వేరే ప్రాంతానికి మార్చేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ విదేశీ సర్వర్ల ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తూ వ్యవస్థలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి కొందరు దీనిని ప్రేరేపిస్తున్నారని, కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. అయితే ఈ అత్యవసర విచారణ పిటిషన్‌ను లిస్ట్ చేయడానికి నిరాకరించిన కోర్టు.. శాంతిభద్రతల వ్యవహారాలను పోలీసులు చూసుకుంటారని మౌఖికంగా వ్యాఖ్యానించింది.

Source : Smacy News

1 hour ago

Home Flash News